అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం: నిపుణుల హెచ్చరికలు మరియు ముందస్తు జాగ్రత్తలు
జాగ్రత్తలు
హైదరాబాద్:
ఈ మధ్యకాలంలో వ్యాయామశాలల్లో (జిమ్), క్రీడా ప్రాంగణాల్లో, వాకింగ్ లేదా జాగింగ్ చేస్తున్న సమయంలో యువకులు మరియు మధ్యవయస్కులు అకస్మాత్తుగా కుప్పకూలి మరణించడం ఆందోళన కలిగిస్తోంది. సడన్ కార్డియాక్ అరెస్ట్ లేదా గుండెపోటు వెనుక అనేక వైద్యపరమైన కారణాలు ఉన్నాయని ప్రముఖ గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ C. ప్రభాకర రెడ్డి (MS, MCh - CTVS) తెలిపారు.
ఆకస్మిక మరణాలకు ముఖ్య కారణాలు:
గుర్తించబడని కొరోనరీ ఆర్టరీ జబ్బులు: గుండె రక్తనాళాల్లో కొవ్వు (ప్లాక్) పేరుకుపోవడం.
హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి (HCM): గుండె కండరాలు అనవసరంగా మందంగా మారే సమస్య.
అసమాన సెప్టల్ హైపర్ట్రోఫీ & మైట్రల్ వాల్వు ప్రొలాప్స్ (MVP): గుండె నిర్మాణాత్మక సమస్యలు.
అరిథమిక్ ధోరణి (Arrhythmia): వెంట్రికులార్ ఫిబ్రిలేషన్ (VF), వెంట్రికులార్ టాకీకార్డియా (VT) వల్ల గుండె కొట్టుకునే వేగం తారుమారవ్వడం.
మందులు మరియు సప్లిమెంట్లు: సరైన వైద్య సలహా లేకుండా వాడే హెవీ సప్లిమెంట్లు, డ్రగ్స్.
డీహైడ్రేషన్: విపరీతమైన వ్యాయామం తర్వాత శరీరంలో నీటి శాతం తగ్గడం.
చేయించుకోవాల్సిన కీలక పరీక్షలు:
తీవ్రమైన వ్యాయామాలు లేదా జిమ్ ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ కార్డియాక్ చెకప్ చేయించుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా 35-40 ఏళ్లు దాటిన వారు క్రింది పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముప్పును అంచనా వేయవచ్చు:
ECG (ఈసీజీ)
ECHO (ఎకో కార్డియోగామ్)
TMT (ట్రెడ్‌మిల్/స్ట్రెస్ టెస్ట్)
CT ఆంజియోగ్రామ్: హైరిస్క్ ఉన్నవారు రక్తనాళాల్లో కాల్సియం స్కోర్ తెలుసుకోవడానికి ప్రతీ 5 ఏళ్లకు ఒకసారి చేసుకోవచ్చు.
లిపిడ్ ప్రొఫైల్, బిపి, షుగర్: ఏటికేడు తనిఖీ చేయించుకోవడం అవసరం.
అత్యవసర సమయంలో పాటించాల్సిన ప్రాథమిక చికిత్స (First Aid):
గుండెపోటు లక్షణాలు (తీవ్రమైన ఛాతీ నొప్పి) అనిపించిన వెంటనే ఆస్పిరిన్ (Aspirin 75mg) 2 మాత్రలను బాగా నమిలి మింగడం వల్ల అది త్వరగా రక్తంలోకి శోషించబడి క్లాటింగ్ ప్రక్రియను నిరోధిస్తుంది.
వ్యక్తి స్పృహ తప్పి పడిపోతే, ఆలస్యం చేయకుండా వెంటనే 108కి కాల్ చేసి, CPR (Cardiopulmonary Resuscitation) ప్రారంభించాలి. సిబ్బంది డీఫిబ్రిలేటర్ సహాయంతో వైద్యం అందిస్తూ ఆసుపత్రికి తరలిస్తారు.
ధూమపానం, మద్యపానం, అధిక ఒత్తిడి, మధుమేహం మరియు బిపి వంటి సమస్యలను నియంత్రించుకుంటూ, సమతుల్య జీవనశైలిని పాటించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.