వ్యవసాయ యాంత్రీకరణకు రూ.147.99 కోట్లు
హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.147.99 కోట్లను కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సాగు పనుల్లో యాంత్రీకరణను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది.
ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు వ్యవసాయ పరికరాల కొనుగోలుపై 60 శాతం సబ్సిడీ, బీసీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ అందించనున్నట్లు వివరించింది. రైతులు తమకు నచ్చిన కంపెనీ నుంచి 37 రకాల వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది.
వ్యవసాయ పనులకు అవసరమైన యంత్రాలు, పరికరాలను రైతులు సులభంగా పొందేలా పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. చిన్న, సన్నకారు రైతులకు కూడా ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించడంతో పాటు పనులను సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.
రైతులకు అవసరమైన యంత్రాలు, పరికరాలను సామూహికంగా అందుబాటులోకి తీసుకురావడానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు) ద్వారా కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతులు వ్యక్తిగతంగా ఖరీదైన యంత్రాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, అవసరమైన సమయంలో యంత్రాలను అద్దెకు తీసుకునే అవకాశం కల్పించడమే కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఉద్దేశమని పేర్కొంది.
అదేవిధంగా ‘రైతు నేస్తం’ కార్యక్రమం ద్వారా రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించి, వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో అవసరమైన మార్పులు, మెరుగుదలలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతుల అవసరాలకు అనుగుణంగా యాంత్రీకరణ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు కొనసాగనున్నాయి.