ఏలూరులో బాల్య వివాహాన్ని అడ్డుకున్న శక్తి టీం
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం.. బాలికల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు
ఏలూరు, నవంబర్ 4: ఏలూరు జిల్లాలో బాల్య వివాహాన్ని శక్తి టీం సభ్యులు అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు మహిళలు, బాలికల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న జిల్లా పోలీస్ శాఖకు చెందిన శక్తి టీం సభ్యులకు ఆర్.ఆర్. పేటలోని పాముల దిబ్బ ప్రాంతంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే స్పందించిన బృందం అక్కడికి చేరుకుని వివాహాన్ని నిలిపివేసింది. ఈ సందర్భంగా ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు సంబంధిత కుటుంబ సభ్యులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల కారణంగా బాలికల విద్యకు ఆటంకం కలగడమే కాకుండా, వారి ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. బాలికలకు నాణ్యమైన విద్యను అందించి, వారు తమ లక్ష్యాలను సాధించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని, బాలల హక్కులు, భద్రత పరిరక్షణకు ఏలూరు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు తెలిపారు.