మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన
రామన్నపేట: రామన్నపేట స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో షీ టీమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ ప్రతినిధులు రవీందర్ రెడ్డి, అశోక్ పాల్గొని మహిళల భద్రత, మహిళలపై వేధింపులను నివారించే చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో షీ టీమ్‌ను సంప్రదించే విధానం, అందుబాటులో ఉన్న సహాయ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలు, విద్యార్థినులు ఎదుర్కొనే సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత సహాయ వ్యవస్థలను వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్. రత్న మంజుల మాట్లాడుతూ మహిళలను చైతన్యపరచడంలో షీ టీమ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ ఎం. అనిత, జాతీయ సేవా పథకం కార్యక్రమ అధికారులు డాక్టర్ జె. చిన్నబాబు, డాక్టర్ జి. సునీత, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. లక్ష్మీ నీలిమతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.