గంపలగూడెంలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత..
పుల్లమ్మకు పార్టీ గుర్తింపు టికెట్ కేటాయింపుపై ఎంపీ కేశినేని చిన్ని వివరణ
కూటమి సమన్వయంతో పనిచేస్తున్నామని వెల్లడి ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఏ.కొండూరు, గంపలగూడెం, తిరువూరు రూరల్, విస్సన్నపేట మండలాల్లో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పర్యటించి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంపలగూడెం జడ్పీటీసీ అభ్యర్థి పుల్లమ్మకు టికెట్ కేటాయింపు, పార్టీ నిర్ణయాలు, కూటమి సమన్వయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. గంపలగూడెం జడ్పీటీసీ టికెట్ కేటాయింపులో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచి, ఉద్యోగాన్ని సైతం వదులుకుని పార్టీ కోసం పనిచేసిన పుల్లమ్మ కుటుంబ సేవలను అధిష్ఠానం గుర్తించిందన్నారు. పలువురు టికెట్ కోసం పోటీపడినప్పటికీ స్థానిక నాయకులు త్యాగం చేసి పుల్లమ్మకు అవకాశం కల్పించారని వివరించారు. ఆమెకు నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో 64 శాతం మద్దతు లభించిందని వెల్లడించారు. టికెట్ల కేటాయింపులో సర్వేలు, పార్టీ పట్ల అంకితభావం, ప్రజాదరణను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకే పుల్లమ్మకు టికెట్ ఇచ్చారన్న ప్రచారంపై స్పందిస్తూ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేదాలు సహజమని, వాటిని పెద్దవిగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల సమయంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని, కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యక్తుల కంటే పార్టీ నిర్ణయమే ముఖ్యమని, అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. లోకేశ్ నాయకత్వంలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. కూటమిలో సమన్వయానికి ఎలాంటి ఇబ్బందులు లేవని, నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.