ఖైదీల సంక్షేమం, న్యాయ సహాయం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్ష
ఏలూరు జిల్లా కారాగారంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జిల్లా అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బోర్డ్ ఆఫ్ విజిటర్స్‌తో కలిసి కారాగారాన్ని సందర్శించిన అధికారులు ఖైదీల సంక్షేమం, న్యాయ సహాయం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఖైదీల జీవన ప్రమాణాలు, నివాస సౌకర్యాలు, వైద్య సేవలు, ఆహార నాణ్యత, కారాగారంలో భద్రతా పరిస్థితులను అధికారులు పరిశీలించారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విచారణ ఖైదీలను సకాలంలో న్యాయస్థానాల్లో హాజరుపరిచేందుకు పోలీసు శాఖ తరఫున పటిష్టమైన ఎస్కార్ట్ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. పోలీసు శాఖ, కారాగార శాఖ, న్యాయ సేవాధికార సంస్థల సమన్వయంతో ఖైదీలకు న్యాయ సహాయం, వైద్య సేవలు, అవసరమైన ఇతర సౌకర్యాలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఖైదీల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి అవసరమైన చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కారాగారంలో భద్రతా ప్రమాణాలు, ఖైదీలకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి, జిల్లా కారాగార సూపరింటెండెంట్ డి. నరసింహ రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్ఓ ఎం. ముక్కంటి, బోర్డ్ ఆఫ్ విజిటర్స్ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.