ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్
నిర్మల్: జిల్లా ప్రజల సమస్యలను సులభంగా, వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతుల కోసం ప్రతిసారి కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ఈ డిజిటల్ వేదికను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను వాట్సాప్ నంబర్ 83175 57897కు మెసేజ్ రూపంలో పంపవచ్చని కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదుతో పాటు సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, సమస్య ఉన్న ప్రదేశం చిరునామా, అవసరమైన ఆధారాలు, ఫొటోలను పంపించాలని సూచించారు. వివరాలు స్పష్టంగా అందించడం ద్వారా సమస్యను సంబంధిత శాఖకు వేగంగా పంపించి పరిష్కార ప్రక్రియను సులభతరం చేయవచ్చని తెలిపారు.
ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును ప్రత్యేక బృందం నమోదు చేసి వెంటనే సంబంధిత శాఖ అధికారులకు పంపిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిర్ణీత కాలపరిమితిలో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే ఈ వాట్సాప్ నంబర్‌కు పంపించాలని కలెక్టర్ సూచించారు. అనవసరమైన లేదా తప్పుడు సందేశాలను పంపవద్దని, వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ నంబర్‌ను కేవలం సేవల కోసం మాత్రమే వినియోగించాలని కోరారు. ఈ నంబర్‌కు ఫోన్ కాల్స్ చేయవద్దని, ఫిర్యాదులు, వినతులను వాట్సాప్ మెసేజ్ రూపంలో మాత్రమే పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా ప్రజలు ఈ వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ సేవలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు.