క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలి
NTODAY NEWS : చిట్యాల
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని, క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని చిట్యాల పురపాలక చైర్‌పర్సన్ పందిరి గీతా అన్నారు. చిట్యాల పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత యూనిఫామ్స్, షూస్, బెల్టులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, షూస్, టైలు, బెల్టులు, యూనిఫామ్స్‌తో కూడిన కిట్లను అందిస్తోందని తెలిపారు. త్వరలోనే అన్ని పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు మున్సిపాలిటీ తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. 173 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో తరగతి గదుల కొరత ఉందని, ఈ సమస్యను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకెళ్లి అదనపు తరగతి గదులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని చైర్‌పర్సన్ గీతా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, కౌన్సిలర్ కుక్కల లత రాజేష్, ఉపాధ్యాయులు వై. సరిత, ఎస్. సతీష్ కుమార్, ఏ. చైతన్య, జి. మహేశ్వరి, కె. మాధవి తదితరులు పాల్గొన్నారు.