ఓట్ల లెక్కింపు వీడియో మాయమవడంపై ఈసీకి సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఎన్నికల రికార్డుల భద్రతపై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం తీరును ప్రశ్నించింది. కర్ణాటకలోని శ్రీంగేరి అసెంబ్లీ నియోజకవర్గం 2023 ఎన్నికల ఓట్ల లెక్కింపు వీడియోను గుర్తించలేకపోయామని ఈసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలపడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
శ్రీంగేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి టీడీ రాజేగౌడ 201 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఫలితాన్ని సవాల్ చేస్తూ బీజేపీ అభ్యర్థి డీఎన్ జీవరాజ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం రీకౌంటింగ్ ప్రక్రియలో జీవరాజ్ను విజేతగా ప్రకటించిన అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాజేగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు విచారణ సందర్భంగా 2023 నాటి ఓట్ల లెక్కింపు వీడియో తమ వద్ద గుర్తించలేకపోయామని ఈసీఐ తరఫు న్యాయవాది శేషాద్రి నాయుడు ధర్మాసనానికి వివరించారు. దీనిపై జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ్లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల నిర్వహణ బాధ్యత ఉన్న సంస్థే ఎన్నికల రికార్డులను భద్రపరచలేకపోతే ఎలా అంటూ ప్రశ్నించింది.
తదుపరి విచారణ నాటికి అందుబాటులో ఉన్న రికార్డులు, వీడియోలను సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం.. లేకపోతే ఈసీకి వ్యతిరేకంగా ప్రతికూల అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను 2027 ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది.