తుమ్మగూడెంలో ఘనంగా అంగన్వాడీ మాసోత్సవం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ మాసోత్సవ కార్యక్రమాన్ని అంగన్వాడీ పర్యవేక్షకురాలు పి. గాయత్రి దేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై కార్యక్రమంలో అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మందలపు రాజా, బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మందలపు మధు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇజ్జిగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు తల్లులకు ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించడం ద్వారా అంగన్వాడీ సిబ్బంది సమాజానికి ముఖ్యమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
మాదాసు చంద్రకళ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అంగన్వాడీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మందలపు రాజా మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లో నిరంతరం సేవలందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు.
అనంతరం గ్రామంలో అంగన్వాడీ సేవలను అందిస్తున్న కార్యకర్తలు కొడాలి హేమలత, ఏ. చెన్నమ్మ, ఎం. మరియమ్మ, ఎం. సంధ్యారాణి, పి. స్వర్ణలత, కె. కన్నమ్మలను ఘనంగా సత్కరించారు. వారి సేవలను అభినందిస్తూ శాలువాలతో సత్కారం చేశారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాల రఘుబాబు, చల్లగుళ్ల సుబ్బారావు, కంచర్ల నాని, అంగన్వాడీ సహాయకులు ఎస్. నాగమణి, ఎస్.కె. బీబీజా, ఎం. సుగుణ, కె. ధనలక్ష్మి, ఆశ కార్యకర్తలు ఎం. చిట్టెమ్మ, చాట్ల అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.