నవంబర్ 15లోగా ప్రశస్తు 2.0 మొదటి దశ పూర్తి చేయాలి
ఖానాపూర్, అక్టోబర్ 28: సమ్మిళిత విద్యలో భాగంగా నిర్వహిస్తున్న ప్రశస్తు 2.0 స్క్రీనింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖానాపూర్ మండల విద్యాశాఖ అధికారి బానోతు వెంకట్రాం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు.
బుధవారం ఖానాపూర్ మండల వనరుల కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 3 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రశస్తు 2.0 ద్వారా స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల్లో ప్రత్యేక అవసరాలకు సంబంధించిన సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
రిసోర్స్ పర్సన్లు తాళ్లపల్లి రాజు, మహేందర్, రజిని మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రశస్తు 2.0 స్క్రీనింగ్ మొదటి దశను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని కోరారు. యాప్‌లో సూచించిన విధానాన్ని అనుసరిస్తూ విద్యార్థుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
నవంబర్ 15వ తేదీలోగా స్క్రీనింగ్ మొదటి దశను పూర్తి చేయాలని మండల విద్యాశాఖ అధికారి ఆదేశించారు. ఈ సమావేశంలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్లు, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు.