లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి
ఎల్కతుర్తి గ్రామoలో లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి,గ్రామసభలో DRDA అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్, స్పెషల్ ఆఫీసర్‌కు వినతిపత్రం
శుక్రవారం గ్రామ సర్పంచ్ మునిగడప లావణ్య అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో లోతట్టు ప్రాంతానికి చెందిన కుటుంబాలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా DRDA అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ ఆదిరెడ్డిలకు లోతట్టు ప్రాంత కుటుంబాల తరఫున వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అంబాల జగన్ మాట్లాడుతూ, లోతట్టు ప్రాంతానికి చెందిన కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వారి సమస్యలకు సరైన పరిష్కారం లభించడం లేదని తెలిపారు. ఎలకతుర్తి గ్రామంలోని ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరంతా లోతట్టు ప్రాంతంలోని కుటుంబాల ఇళ్ల వద్దకు చేరుతోందని, చిన్నపాటి వర్షం కురిసినా ఇళ్లలోకి వరద నీరు చేరి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
లోతట్టు ప్రాంతంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ, మురుగు నీటి కాలువలు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ లేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని తెలిపారు. ముఖ్యంగా దళిత కుటుంబాలు నివసించే ప్రాంతంలో ప్రతి వర్షాకాలంలో నీరు నిలిచిపోవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరుతోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఉన్నతస్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి, సమగ్ర డ్రైనేజీ మరియు నీటి పారుదల ప్రణాళిక రూపొందించాలని అంబాల జగన్ డిమాండ్ చేశారు.
గ్రామసభను కేవలం నామమాత్ర కార్యక్రమంగా నిర్వహించకుండా, గ్రామ ప్రజలందరి భాగస్వామ్యం మరియు సహకారంతో ప్రజల సమస్యలను చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను రూపొందించాలని అంబాల జగన్ అన్నారు. గ్రామ ప్రజల సమస్యలను గ్రామసభలో చర్చించి, అవసరమైన తీర్మానాలు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడే గ్రామసభకు నిజమైన అర్థం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో DRDA అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్, స్పెషల్ ఆఫీసర్ ఆదిరెడ్డి, గ్రామ సర్పంచ్ మునిగడప లావణ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఏపీఓ అనిత, ఈసీ శ్రీకాంత్, వార్డు సభ్యులు, సీఏ కవిత, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.