భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
షహీద్ భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేర్లకంటి శ్రీకాంత్ పిలుపు
హైదరాబాద్, సెప్టెంబర్ 28/ ఎన్ టుడే న్యూస్.
షహీద్ భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా రాష్ట్ర కార్యాలయం వద్ద భగత్ సింగ్ భారీ కటౌట్ పూలమాలవేసి నివాళులర్పించి ఆయన ఆశయాలను స్మరించుకుంటూ నేటి యువత భగత్ సింగ్ చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేర్లకంటి శ్రీకాంత్ పేర్కొన్నారు. భగత్ సింగ్ కలలుగన్న దోపిడీ రహిత, సమానత్వ సమాజ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదని, అందుకోసం యువత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని, విద్యా–వైద్య రంగాలను వ్యాపార వస్తువులుగా కాకుండా ప్రజల హక్కులుగా గుర్తించి ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించి ప్రజల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను నిలిపివేయాలని కోరారు. సమాజంలో పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతలను నిర్మూలించేందుకు ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
అలాగే మత విద్వేషాలు, విభజన రాజకీయాలు దేశ ఐక్యతకు ప్రమాదకరమని పేర్కొంటూ, భగత్ సింగ్ నిలబెట్టిన లౌకిక, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. యువత, కార్మికులు, రైతుల హక్కులను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో NFIW రాష్ట్ర నాయకులు ప్రేమ పావని, ఛాయాదేవి, జ్యోతి, AIYF హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ బాలకృష్ణ, షేక్ మహమూద్, నాయకులు కంపల్లి కళ్యాణ్, మామిడి చెట్ల భగత్ సింగ్, ఎం కృష్ణ, జగన్, మోహిత్ కుమార్, మాజీద్ అలీ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.