ఒకే రోజు పుట్టినరోజులు జరుపుకున్న ప్రపంచంలోని ఇద్దరు వృద్ధులు
అంతర్జాతీయ వార్తలు: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందిన బ్రెజిల్‌కు చెందిన జోవో మారిన్వో నేటో 114వ పుట్టినరోజు జరుపుకున్నారు. అక్టోబర్ 5న ఆయన పుట్టినరోజు సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఇదే రోజున ప్రపంచంలో రెండో అత్యంత వృద్ధుడైన ఆస్ట్రేలియాకు చెందిన కెన్ వీక్స్ 113వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆసక్తికరంగా వీరిద్దరూ సరిగ్గా ఒక సంవత్సరం తేడాతో జన్మించారు. జోవో 1912 అక్టోబర్ 5న జన్మించగా, కెన్ వీక్స్ 1913లో అదే తేదీన జన్మించారు.
ఈ సందర్భంగా ఇద్దరూ ఒకరికి ఒకరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు రాసిన ఫ్లకార్డులతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ కథనంలో పంచుకుంది.
114 ఏళ్ల వయసుకు చేరుకున్న జోవో మారిన్వో నేటో ప్రపంచంలో ఇప్పటివరకు 114 ఏళ్లు పూర్తి చేసిన అత్యంత వృద్ధ పురుషుల్లో ఒకరిగా నిలిచారు. గిన్నిస్ ప్రకారం 114 ఏళ్లకు చేరుకోవడం పురుషుల్లో అత్యంత అరుదైన మైలురాయి.
ఒకే తేదీన పుట్టిన ఇద్దరు ప్రపంచంలోని అత్యంత వృద్ధ పురుషులు ఒకరికొకరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. వీరి ఫొటోలు, కథనం సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారుతున్నాయి.