భారీ మెజార్టీతో విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా
విజయవాడలో కూటమి ఆధిపత్యం..
సింగిల్ డిజిట్‌కే పరిమితమైన వైసీపీ 2,65,888 ఓట్లు సాధించిన రాధా.. 1,30,872 ఓట్ల మెజార్టీతో విజయం విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి ఆధిపత్యం కొనసాగింది. మూడు పార్టీల మధ్య సమన్వయం, ఉమ్మడి ప్రచారం నేపథ్యంలో తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థులు అత్యధిక డివిజన్లలో విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమైంది. అర్ధరాత్రి 1.30 గంటల సమయానికి 82 డివిజన్ల ఫలితాలు వెల్లడించగా, కూటమి అభ్యర్థులు 72 స్థానాల్లో విజయం సాధించగా, వైసీపీ 8 స్థానాల్లో గెలుపొందింది. మిగిలిన స్థానాల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఏకతాటిపై సాగిన మూడు పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినప్పటి నుంచి తెదేపా, జనసేన, భాజపా నేతలు సమన్వయంతో ముందుకు సాగారు. సీట్ల సర్దుబాటులో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, అనంతరం ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షురాలు గద్దె అనూరాధ, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న, జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, భాజపా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు మూడు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. పుట్టినరోజే మేయర్‌గా వంగవీటి రాధా విజయవాడ మేయర్ పీఠాన్ని జనసేన నాయకుడు వంగవీటి రాధా దక్కించుకున్నారు. తన పుట్టినరోజు నాడే మేయర్‌గా విజయం సాధించడం ఆయనకు ప్రత్యేకంగా నిలిచింది. ఎన్నికల ముందు జనసేనలో చేరిన రాధా కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నామినేషన్ అనంతరం కూటమి నేతలతో సమన్వయం చేసుకుంటూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. మేయర్ ఎన్నికలో రాధాకు 2,65,888 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు వచ్చాయి. దీంతో రాధా 1,30,872 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి ఏబీవీకి 12,642 ఓట్లు లభించాయి.