వర్షాలు సమృద్ధిగా కురవాలని కందుకూరులో వరుణయాగం
కందుకూరు: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కందుకూరులో మంగళవారం వరుణయాగం నిర్వహించారు. పట్టణంలోని జనార్ధనస్వామి దేవాలయంలో నిర్వహించిన ఈ యాగంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
యాగ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు ఆలయ పండితులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం జనార్ధనస్వామి, వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో వరుణయాగ క్రతువును చేపట్టి, హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వరుణయాగం నిర్వహించినట్లు తెలిపారు. దేవుడి అనుగ్రహంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.
కార్యక్రమంలో ఆలయ ఈవో బైరాగి చౌదరి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్నం భాస్కర్‌రావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు, వరప్రసాదరావు, భూషయ్య, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీను, జనసేన పట్టణ అధ్యక్షుడు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే టీడీపీ నాయకులు గుమ్మా శివ, ముప్పవరపు వేణు, భవనాసి వెంకటేశ్వర్లు, మచ్చా మనోహర్, సూర్యనారాయణ, కంకణాల వెంకటేశ్వర్లు, కోటా కిషోర్, వాసు, రూబీ, రఫీ, జియావుద్దీన్, అహ్మద్, పసుపులేటి రమణయ్య, శివరామకృష్ణ, వడ్లమూడి చెంచు నారాయణ, వలేటి వెంకటేశ్వర్లు, చీదెళ్ల పిచ్చయ్య, రాధాకృష్ణచార్యులు, నందనవనం రామసుబ్బారావు, యర్రా యోగేశ్వరరావు, చల్లా మహేంద్ర, నీలిశెట్టి సురేష్, నందికనమల లక్ష్మణరావు, పెట్లూరి సుబ్బారావు, తలమంచి బ్రహ్మయ్య, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.