నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ
తెలంగాణ
నూకలగూడెం (మేడ్చల్-మల్కాజిగిరి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని నూకలగూడెం గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి మండపం వద్ద నిర్వహించిన గణపతి హోమ ప్రసాద లడ్డూ వేలం పాట భక్తుల జయజయధ్వానాల నడుమ ఉత్సాహభరితంగా జరిగింది.
లడ్డూ వేలంలో భక్తులు పోటీపడి పాల్గొన్నారు. చివరకు గణపతి హోమ ప్రసాద లడ్డూ రూ.50,000 ధర పలికింది. గ్రామానికి చెందిన రామిడి నరసింహారెడ్డి అత్యధిక మొత్తానికి వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. గణపతి ఆశీస్సులు తమ కుటుంబంతో పాటు నూకలగూడెం గ్రామ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల సందడితో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.