చింతలపాడులో సుడిగాలి బీభత్సం – నష్టాన్ని పరిశీలించిన ఆర్‌డీఓ ఏ. కుమార్
తిరువూరు: పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో అకస్మాత్తుగా భారీ సుడిగాలి బీభత్సం సృష్టించింది. కొద్దిసేపు వీచిన బలమైన గాలులకు గ్రామంలో పలుచోట్ల రేకుల ఇళ్లు, పెంకుటిళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులు గాలికి ఎగిరిపడటంతో పాటు పలు ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. కొన్ని ఇళ్లు పూర్తిగా దెబ్బతినడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. సుడిగాలి ధాటికి పలువురు గాయపడినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ వెంటనే చింతలపాడు గ్రామానికి చేరుకుని నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. దెబ్బతిన్న ఇళ్లు, కూలిపోయిన పైకప్పులు, ఎగిరిపోయిన వాటర్ ట్యాంకులు తదితర పరిస్థితులను పరిశీలించి బాధితుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సుడిగాలి కారణంగా గాయపడిన వారిని తక్షణమే తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అవసరమైన వైద్య చికిత్స అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. అనంతరం ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఆర్‌డీఓ ఏ. కుమార్ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నిబంధనల మేరకు అవసరమైన సహాయ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
అనంతరం గ్రామంలో జరిగిన ఆస్తి నష్టంపై సమగ్ర వివరాలు సేకరించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దెబ్బతిన్న విద్యుత్ తీగలు, ఇళ్ల శిథిలాల వద్ద జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ పరిశీలనలో తిరువూరు తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.