చీరకట్టుతో చెప్పులు లేకుండా 1600 మీటర్లు పరుగెత్తిన మహిళ
ఆంధ్రప్రదేశ్
రామ్‌ఘర్: కుటుంబ పోషణ, భవిష్యత్తు కోసం ఓ మహిళ చూపిన పట్టుదల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఝార్ఖండ్‌లోని రామ్‌ఘర్ జిల్లాలో హోంగార్డు ఉద్యోగ నియామకాల్లో భాగంగా నిర్వహించిన 1,600 మీటర్ల రన్నింగ్ ట్రయల్స్‌లో ఓ మహిళ చీరకట్టుతో, చెప్పులు లేకుండా పాల్గొన్నారు.
ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఆమె ఎలాంటి ఇబ్బందులను లెక్కచేయకుండా పరుగు పరీక్షను పూర్తి చేశారు. సాధారణంగా క్రీడా దుస్తులు, షూస్‌తో అభ్యర్థులు పాల్గొనే రన్నింగ్ ట్రయల్స్‌లో ఆమె చీరతోనే పరుగెత్తడం పలువురి దృష్టిని ఆకర్షించింది.
ఝార్ఖండ్‌లో చేపట్టిన హోంగార్డు నియామకాల్లో మొత్తం 772 పోస్టులు ఉండగా, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు సమాచారం. ఈ నియామకాల్లో ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలనే లక్ష్యంతో ఆమె పరీక్షకు హాజరైనట్లు తెలుస్తోంది.
చీరతో, చెప్పులు లేకుండా 1,600 మీటర్ల పరుగు పూర్తి చేసిన ఆమె ఆత్మవిశ్వాసం, పట్టుదలపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ భవిష్యత్తు కోసం ఆమె చేసిన ప్రయత్నం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొంటున్నారు.