మీ ఒక్క ఓటు ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది మంత్రి కొలుసు పార్థసారధి
గ్రామాభివృద్ధికి రూ.83 లక్షలు.. ఎస్సీ ప్రాంత అభివృద్ధికి రూ.30 లక్షలు మంజూరు – మంత్రి కొలుసు పార్థసారథి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం కారణంగా 34 వేల మంది మృతి చెందారంటూ ఆరోపణ ఆగిరిపల్లి, నవంబరు 2: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆగిరిపల్లి మండలంలోని సూరవరం, కృష్ణవరం గ్రామాల్లో కూటమి అభ్యర్థుల తరఫున మంత్రి కొలుసు పార్థసారథి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వేసే ఒక్క ఓటు రాబోయే ఐదేళ్ల గ్రామాభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. ఓటు అనేది కేవలం కాగితం కాదని, ప్రజల బాధ్యతతో పాటు గ్రామాభివృద్ధికి బాటలు వేసే శక్తి అని పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని విస్మరించిందని, 15వ ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లించిందని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో గ్రామాల అభివృద్ధికి సుమారు రూ.11 వేల కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. పంచాయతీ పాలకవర్గ తీర్మానం లేకుండా నిధులు ఖర్చు చేయడానికి వీలులేకుండా ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చిందని, గ్రామ పంచాయతీల నిధులు వీధి దీపాలు, మురుగునీటి కాలువలు, రహదారులు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలకే వినియోగించేలా చర్యలు చేపట్టిందని వివరించారు. పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలో 39 మధ్యతరహా, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, సుమారు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు ముందడుగు పడిందని, తద్వారా ఎనిమిది లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం సరఫరా కారణంగా సుమారు 34 వేల మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి ఆరోపించారు. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.83 లక్షలు, ఎస్సీ ప్రాంత అభివృద్ధికి సుమారు రూ.30 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. కాపు కల్యాణ మండపం నిర్మాణానికి రూ.కోటి, ఈద్గా, దర్గా అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేశామని, ఎస్సీ, బీసీ కల్యాణ మండపాల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును కూటమి అభ్యర్థులకు వేసి గెలిపించాలని, గ్రామాల అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సరైన నాయకులను ఎన్నుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు ధనలక్ష్మి, జోషి తదితరులు పాల్గొన్నారు.