ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర
వట్టిమర్తి చేరుకున్న సాయిబాబా భక్తుల పాదయాత్ర బృందం
చిట్యాల మండలం, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలోని చిన్న షిరిడీ సాయిబాబా ఆలయం నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయం వరకు 15వ మహా పాదయాత్ర ప్రారంభమైంది. సాయిబాబా ఆలయ మేనేజింగ్ ట్రస్టీ శానంపూడి శ్రీహరి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పాదయాత్ర గురువారం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చేరుకుంది.
ఈ సందర్భంగా శానంపూడి శ్రీహరి మాట్లాడుతూ సాయిబాబా సమాధి చెంది 108 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 27న మహా పాదయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతిరోజూ సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
లోకకల్యాణం, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ పాదయాత్రను చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 17 లేదా 18వ తేదీ నాటికి షిరిడీ చేరుకునేలా పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
శానంపూడి శ్రీహరి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్రలో మండాది కొండారెడ్డి, చల్లా శ్రీనివాసరావు, ఎక్కంటి చంద్రశేఖర్ రెడ్డి, కడియాల ప్రకాశరావు, కట్టారాపు విజయ్, అవులూరి రామకృష్ణారెడ్డి, అవులూరి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
వట్టిమర్తి గ్రామంలోని సాయిబాబా ఆలయానికి పాదయాత్ర బృందం చేరుకోగా స్థానిక భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.