ఏపీలో రవాణా సేవల సమస్యల పరిష్కారానికి 24 గంటల కంట్రోల్ రూమ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవాణా సేవలకు సంబంధించిన సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వాహన్, సారథి పోర్టళ్లలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులపై ప్రజలు ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని వెల్లడించారు.
వాహన యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబర్ ప్లేట్ల వివరాల నమోదు వంటి సేవల్లో సమస్యలు ఎదురైతే 9281607001 నంబర్‌కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రజలకు రవాణా సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా, లెర్నర్స్ లైసెన్స్ పరీక్షను ఇంటి నుంచే రాసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.