తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ
తాను తనువు చాలిస్తూ ముగ్గురికి ప్రాణాలు పోసిన రమణమ్మ.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ బ్రెయిన్ డెడ్ కాగా, ఆమె కుటుంబ సభ్యులు విషాద సమయంలోనూ అవయవ దానానికి ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నారు.
వారి నిర్ణయంతో అవయవాలను సేకరించి, అవసరమైన రోగులకు అందించేందుకు వివిధ ఆసుపత్రులకు తరలించారు.
గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామానికి చెందిన 36 ఏళ్ల రమణమ్మ గత నెల 30న కూలి పనులకు ఆటోలో వెళ్తూ చావల గ్రామం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను చికిత్స కోసం నంద్యాలలోని సర్వజన వైద్యశాలకు తరలించారు.
పరిస్థితిని పరిశీలించిన అనంతరం వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు.
ఈ విషాదంలో కుటుంబ సభ్యులు గొప్ప నిర్ణయం తీసుకొని ఆమె అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. జీవన్ దాన్ నిబంధనల మేరకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేశారు. శుక్రవారం అవయవాలను సేకరించి వివిధ ఆసుపత్రులకు తరలించారు.
ఒక కిడ్నీని కర్నూలు నగరంలోని మెడికవర్ ఆసుపత్రికి, కాలేయాన్ని కర్నూలులోని గౌరీగోపాల్ ఆసుపత్రికి, మరో కిడ్నీని నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు, వైద్య సిబ్బంది సమన్వయంతో గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను సకాలంలో ఆయా ఆసుపత్రులకు చేర్చారు.