ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పెండింగ్ ఫైళ్లపై ఆరా.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచన
హనుమకొండ జిల్లా | ఎల్కతుర్తి | Ntoday News
ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, ఆయా పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. పెండింగ్ ఫైళ్లను పరిశీలిస్తూ వాటి జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వ్యవహారాల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రజలకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే స్పందించి, సమస్యను పూర్తిగా పరిశీలించి సంబంధిత వివరాలను వారికి స్పష్టంగా తెలియజేసి వారి పనిని నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు అందుతున్న సేవల విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ తనిఖీలో తహసీల్దార్‌తో పాటు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాగా, హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్. రవి ఇటీవల కూడా వివిధ ప్రభుత్వ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అధికారులకు సూచనలు జారీ చేశారు.