వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు చేపడుతున్న దీక్షకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి. కదిరప్ప, సీపీఐ పట్టణ కార్యదర్శి ఇలియాకత్ అలీ సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజలకు, రెవెన్యూ శాఖకు వీఆర్ఏలు కీలక సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వీఆర్ఏలు కోరుతున్న జీతం స్కేలు అమలు, అర్హత ఉన్న వారికి పదోన్నతులు, ఉద్యోగ భద్రత, సర్వీసుకు సంబంధించిన సమస్యల పరిష్కారం, జాయింట్ యాక్షన్ కమిటీతో ప్రభుత్వం చర్చలు జరపడం, ఉద్యోగుల కుటుంబాలకు రక్షణ కల్పించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు.
ఎన్నో సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సాధ్యమైన డిమాండ్లను కాలపరిమితితో పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వీఆర్ఏలు చేపడుతున్న దీక్షకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నామని, వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటానికి అండగా ఉంటామని వారు తెలిపారు.
కార్యక్రమంలో సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి ఆదినారాయణ, ప్రజానాట్యమండలి భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తిప్పన్న, అంజినప్ప తదితరులు పాల్గొన్నారు.