కొండపిలో పోషణ, ఆరోగ్యంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన
కొండపి, సెప్టెంబర్ 30: కొండపి మండల శిశు సంక్షేమ శాఖ అంగన్‌వాడీ కార్యాలయంలో మంగళవారం పోషణ, ఆరోగ్యం, పరిశుభ్రత అంశాలపై అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీడీపీఓ సుశీలాదేవి మాట్లాడుతూ.. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల్య ఆహారం ఎంతో ముఖ్యమని తెలిపారు. పిల్లల రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను చేర్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.
మంత్రిత్వ శాఖ రూపొందించిన ఐఈసీ టూల్‌కిట్ సహాయంతో చిన్నారులు, తల్లిదండ్రులకు ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన కల్పించే విధానాలను వివరించారు. అలాగే “ఆడండి – పాడండి – నేర్చుకోండి” కార్యక్రమంలో భాగంగా ఆటలు, పాటలు, పజిల్స్ ద్వారా చిన్నారులకు పోషకాహార ప్రాముఖ్యతను సులభంగా వివరించాలని సూచించారు.
చిన్నతనం నుంచే పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు పిల్లల ఆరోగ్యం, పోషణపై తల్లిదండ్రులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా సూపర్‌వైజర్ విక్టోరియా రాణి అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ అందించారు. చిన్నారుల సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం అంగన్‌వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, సమాజం సమిష్టిగా కృషి చేయాలని సీడీపీఓ సుశీలాదేవి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.