పోతనపల్లి గ్రామంలో ఘనంగా అంగన్వాడీ మాసోత్సవాలు
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం: పోతనపల్లి గ్రామంలోని గంటిపాడు ఎల్.టీ. అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పోతనపల్లి గ్రామ అంగన్వాడీ కార్యకర్తలు కె. దేవమణి, బి. కుమారి, వి. దేవి, బి. కృపాబాయమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసీడీఎస్ సీడీపీవో వి. విజయకుమారి, సూపర్‌వైజర్ గాయత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న ఆహార పదార్థాలను స్వయంగా రుచి చూసిన అధికారులు సిబ్బందిని అభినందించారు.
గర్భిణులు, బాలింతలకు ప్రతి నెల అందించే బియ్యం, కందిపప్పు, నూనె, బాలసంజీవని కిట్లు, రాగిపిండి, అటుకులు, బెల్లం, ఎండు ఖర్జూరం, వేరుశనగ చిక్కి, పాలు, గుడ్లు తదితర పోషకాహార పదార్థాలు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాన్ని అధికారులు అడిగి తెలుసుకున్నారు. అలాగే 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అందించే బాలామృతం పంపిణీపై కూడా వివరాలు సేకరించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు డి. మంగయ్య, ఎల్. వెంకటేశ్వరరావు, టి. సుధాకరరావు, ఎం. రాజీవ్ నాయక్‌తో పాటు గర్భిణులు, బాలింతలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.