పోస్ట్‌కార్డులపై ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు
కృష్ణారావుపాలెం ప్రాథమిక పాఠశాలలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం ప్రాథమిక పాఠశాలలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్, ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్ ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పోస్టుకార్డులపై ‘హ్యాపీ బర్త్‌డే టు నరేంద్ర మోదీ జీ’ అని రాసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆ పోస్టుకార్డులను ప్రధానమంత్రికి పంపేందుకు పోస్టుబాక్సులో వేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ పోస్టుకార్డు, పోస్టుకవరు, పోస్టుబాక్సు వంటి వాటి పేర్లు విన్నప్పటికీ వాటిని ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి అని తెలిపారు. స్వయంగా పోస్టుకార్డుపై ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు రాసి పంపడం ఎంతో ఆనందంగా ఉందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేఖర్ మాట్లాడుతూ ప్రస్తుత తరం విద్యార్థులకు పోస్టుకార్డులు, పోస్టుబాక్సుల వినియోగం, వాటి ప్రాముఖ్యత, గతంలో ఉత్తరాల ద్వారా సమాచారాన్ని పంపే విధానం, పోస్టాఫీసులు అందించే సేవల గురించి వివరించడం అవసరమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పాతకాలపు ఉత్తర ప్రత్యుత్తరాల విధానాన్ని ప్రత్యక్షంగా పరిచయం చేయడంతోపాటు, వారితో పోస్టుకార్డులపై శుభాకాంక్షలు రాయించి పోస్టుబాక్సులో వేయించడం సంతోషంగా ఉందన్నారు. కాలక్రమంలో మరుగునపడుతున్న పాత సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేస్తున్న బీజేపీ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మొదటి పోలింగ్ బూత్ అధ్యక్షుడు, కృష్ణారావుపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు చిట్టెం శ్రీనివాసరావు, చాట్రాయి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కూరపాటి బాబ్జి, కృష్ణారావుపాలెం టీడీపీ సర్పంచ్ చిమటబోయిన పుల్లారావు, పాఠశాల ఉపాధ్యాయులు శేఖర్, సీహెచ్ విజయకుమార్, సుజాత, ఎస్. శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.