న్యాయవాదిపై రౌడీషీట్ ఓపెన్ చేయడాన్ని నిరసిస్తూ రెండో రోజు విధుల బహిష్కరణ
తిరువూరు: విజయవాడకు చెందిన సీనియర్ న్యాయవాది ఓగ్గు గవాస్కర్‌పై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేయడాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు తిరువూరు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రెండో రోజు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులపై అక్రమ కేసులు నమోదు చేయడం, రౌడీషీట్లు తెరవడం వంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. న్యాయవాదులు తమ వృత్తిపరమైన విధులను స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని కోరారు. న్యాయవాదుల హక్కులు, భద్రతకు భరోసా కల్పించేలా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని (అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్) వెంటనే అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
న్యాయవాదులపై ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. న్యాయవాదుల రక్షణకు చట్టపరమైన భరోసా కల్పించడం అవసరమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సంకురాత్రి జనార్ధన్‌రావు, ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి కృష్ణారెడ్డి, కార్యదర్శి కనపర్తి రాంబాబు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.