చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న
విజయవాడ, సెప్టెంబర్ 30: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వినాయకుని గుడి వద్ద నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో సుమారు 5 వేల మంది ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి చేరుకున్న సమయంలో నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చినట్లు పేర్కొన్నారు. బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో జన సమీకరణతో కార్యక్రమం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు భూమిపై హక్కు కల్పించే దిశగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రాధాన్యత కలిగిందన్నారు. ప్రజలకు సొంత స్థలం, సొంత ఇంటి కలను సాకారం చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.