స్థానిక ఎన్నికల అభ్యర్థులకు 24 గంటల్లో ధ్రువీకరణ పత్రాలు
అమరావతి: ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.
సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి జాప్యం జరగకుండా జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించింది.
మరోవైపు స్థానిక ఎన్నికల సందర్భంగా అదనపు భద్రత కోసం పారా మిలటరీ బలగాలను కేటాయించాలని కోరుతూ డీజీపీకి లేఖ రాసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.