చాట్రాయి మండలంలో వైసీపీ కంచుకోటలను బద్దలు కొట్టేందుకు మంత్రి వ్యూహం
ఆ నాలుగు గ్రామాలపైనే ప్రత్యేక దృష్టి.
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా అడుగులు పర్వతాపురం, బూరుగుగూడెంలో వైసీపీకి ఎదురుదెబ్బ.. పోతనపల్లిలోనూ మారుతున్న సమీకరణాలు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలో స్థానిక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టున్న మండలంలో ఆ పార్టీ ఆధిపత్యానికి గండిపడటంతో తెలుగుదేశం పార్టీ మరింత పుంజుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా బూరుగుగూడెం, పర్వతాపురం, నరసింహారావుపాలెం, పోతనపల్లి గ్రామాలపై మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గ్రామాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలు
చాట్రాయి మండలం ఒకప్పుడు వైసీపీకి బలమైన రాజకీయ స్థావరంగా ఉండేది. గత ఎన్నికల్లోనూ ఆ పార్టీకి మండలంలో గణనీయమైన మెజారిటీలు వస్తాయనే అంచనాలు ఉండేవి. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితులు మారాయి. మండలంలోని 18 పంచాయతీల పరిధిలో 14 పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం లభించినట్లు స్థానిక రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొలుసు పార్థసారథి విజయం సాధించడంతో పాటు మంత్రి పదవిని చేపట్టడం స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసింది. గతంలో వైసీపీకి బలమైన మద్దతు లభించిన ప్రాంతాల్లోనూ టీడీపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే బూరుగుగూడెం, పర్వతాపురం, నరసింహారావుపాలెం, పోతనపల్లి గ్రామాల్లో వైసీపీకి మద్దతు లభించిన నేపథ్యంలో ఈ నాలుగు గ్రామాలపై టీడీపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.
పర్వతాపురంలో టీడీపీకి కొత్త బలం
పర్వతాపురం గ్రామంలో వైసీపీకి గతంలో బలమైన వర్గంగా ఉన్న నాయకుల్లో కొందరు టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన మిద్దె సత్యనారాయణ అలియాస్ అడవి సత్యం కేవలం 30 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన, టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పుకోవడంతో గ్రామంలో టీడీపీకి అదనపు బలం చేకూరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న స్థానిక ఎన్నికల్లో ఈ పరిణామం ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
బూరుగుగూడెంలో రాజకీయంగా కీలక పరిణామం
చాట్రాయి మండల రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే వైసీపీ నాయకుడు దేశిరెడ్డి రాఘవరెడ్డికి బూరుగుగూడెం స్వగ్రామం. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో టీడీపీ బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గ్రామానికి చెందిన కాలసాని సూర్యనారాయణ మాస్టారు తన అనుచరులతో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో టీడీపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సౌమ్య స్వభావం, స్థానికంగా ఉన్న పరిచయాలు, అనుచర వర్గం కారణంగా సూర్యనారాయణ చేరిక టీడీపీకి ఉపయోగపడవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటివరకు గ్రామంలో పార్టీకి ఆశించిన స్థాయిలో బలం లేదనే అభిప్రాయాల మధ్య ఈ చేరిక కొత్త ఉత్సాహాన్ని నింపింది. గ్రామంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను సూర్యనారాయణకు అప్పగించి, రానున్న ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యాన్ని తగ్గించే దిశగా మంత్రి వ్యూహరచన చేస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ చేరిక ఓట్ల రూపంలో ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ఎన్నికల సమయంలోనే స్పష్టమవుతుంది.
పోతనపల్లిలోనూ మారనున్న రాజకీయ లెక్కలు
పోతనపల్లి గ్రామంలోనూ ఒక బలమైన వర్గం టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గ్రామంలో ఇప్పటివరకు ఉన్న రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. అయితే ఈ చేరికలపై స్పష్టత రావాల్సి ఉంది. స్థానిక నాయకుల మధ్య చర్చలు, పార్టీ మార్పుల పరిణామాలు రానున్న ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశాలున్నాయి.
నరసింహారావుపాలెంలో టీడీపీకి అంతర్గత సవాళ్లు
నరసింహారావుపాలెం గ్రామంలో వైసీపీకి బలమైన పునాది ఉండగా, టీడీపీలోని అంతర్గత విభేదాలు ఆ పార్టీకి సవాలుగా మారుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం లోపిస్తే వైసీపీకి ఉన్న ఆధిక్యాన్ని తగ్గించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పీఏసీఎస్ ఛైర్పర్సన్ కట్టా నాగదుర్గారావు గ్రామంలో పార్టీని బలోపేతం చేసేందుకు చురుకుగా పనిచేస్తున్నట్లు సమాచారం. స్థానిక నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ద్వారా వైసీపీ ఆధిక్యాన్ని తగ్గించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, వైసీపీ సీనియర్ నాయకుడు రాజకీయ అనుభవశాలి పుచ్చకాయల సుబ్బారెడ్డి తన రాజకీయ వ్యూహాల్లో భాగంగా కొందరు అనుచరులకు స్థానిక అవసరాల నిమిత్తం టీడీపీ నాయకులతో సన్నిహితంగా ఉండాలని సూచించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమాచారంపై స్వతంత్ర నిర్ధారణ లేదు. ఈ నేపథ్యంలో గ్రామంలో వైసీపీ తన పట్టు నిలబెట్టుకుంటుందా, టీడీపీ అంతర్గత విభేదాలను అధిగమించి బలపడుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష
చాట్రాయి మండలంలో మారుతున్న రాజకీయ పరిణామాలు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంతో పాటు వైసీపీకి బలమైన పట్టున్న గ్రామాల్లోనూ పాగా వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు, తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో పట్టు కోల్పోకుండా వైసీపీ నాయకత్వం ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందన్నది కీలకంగా మారింది. నాయకుల చేరికలు, స్థానిక వర్గాల బలాబలాలు, పార్టీల మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. మంత్రి కొలుసు పార్థసారథి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి, వైసీపీ తన పాత ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలుగుతుందా, నాలుగు గ్రామాల్లో రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుంది అన్నది రానున్న స్థానిక ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి. ఏది ఏమైనా వైసీపీకి గట్టి పట్టున్న ఈ నాలుగు గ్రామాలలో గనుక ఒకవేళ టీడీపీ ఆధిపత్యం సాధిస్తే వైసిపి తన పట్టును చాట్రాయి మండలంలో పూర్తిగా కోల్పోయినట్లు అవుతుంది దీనికి రాఘవరెడ్డి వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది, మంత్రి పార్థసారథి వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అనేది వేచి చూడాలి