తుపాను వేళ ఏపీకి తెలంగాణ అండ
విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది, సామగ్రి పంపిస్తాం భట్టి విక్రమార్క హామీ.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి గొట్టిపాటి
ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన అర్నబ్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ పనులకు అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మేరకు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీశారు. తుపాను కారణంగా విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని అధిగమించి, ప్రజలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బందిని, సామగ్రిని పంపిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. విపత్తు సమయంలో పొరుగు రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం పట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం సుమారు 6,000 మంది సిబ్బందిని రంగంలోకి దించినట్లు సమాచారం. దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, స్తంభాల మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు. తుపాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు త్వరితగతిన ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా రెండు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం బాధితులకు త్వరగా సాయం అందించేందుకు దోహదపడనుంది.