చింతలపూడి నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థిగా దేవమణి పేరు ఖరారు దిశగా అడుగులు
ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రియన్పేటకు చెందిన సందిపం దేవమణి పేరు చైర్మన్ అభ్యర్థిగా ప్రముఖంగా వినిపిస్తోంది.
దివంగత సందిపం జయపాల్ కుమారుడు సందిపం కిషోర్ భార్య అయిన దేవమణి అభ్యర్థిత్వానికి మద్దతుగా సుప్రియన్పేటకు చెందిన వందలాది మంది యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై గ్రామం నుంచి బయలుదేరిన యువకులు సిటీ మెడికల్ మీదుగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ పదవికి తాము సిద్ధంగా ఉన్నట్లు సందిపం కిషోర్, దేవమణి దంపతులు ఎమ్మెల్యే రోషన్ కుమార్కు తమ బయోడేటాను అందజేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పార్టీ కోసం పనిచేసిన తమకు అవకాశం కల్పించాలని వారు కోరారు.
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. చింతలపూడి నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థి ఎంపికలో దేవమణి పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.