ఏపీలో లాసెట్ సీట్ల కేటాయింపులో గందరగోళం.. 1,100 మంది విద్యార్థులకు నష్టం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో లాసెట్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపులో సాంకేతిక సమస్యలు గందరగోళానికి దారితీశాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో 6,896 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించగా, సాంకేతిక లోపాల కారణంగా ఆ కేటాయింపులను రద్దు చేసి అధికారులు తిరిగి ఫలితాలను విడుదల చేశారు. ఈ మార్పుల కారణంగా గతంలో సీట్లు పొందిన వారిలో సుమారు 1,100 మంది విద్యార్థులు తమ సీట్లను కోల్పోయినట్లు సమాచారం.
రెండో విడతలో మొత్తం 6,988 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అయితే, తొలివిడతలో సీట్లు పొంది కళాశాలల్లో చేరేందుకు వెళ్లిన విద్యార్థులకు తాజా ఫలితాలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక లోపాల కారణంగా సీట్ల కేటాయింపులు మారడంతో విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.