ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు
ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు.. స్థలాన్ని పరిశీలించిన అధికారులు
మునగపాక: గ్రామంలోని ఇరిగేషన్ కాలువపై నిర్మాణం చేపట్టారంటూ వచ్చిన ఫిర్యాదుపై ఇరిగేషన్ శాఖ ఏఈ, రెవెన్యూ అధికారులు బుధవారం స్థలాన్ని పరిశీలించారు. మెయిన్ రోడ్డును ఆనుకుని స్టేట్ బ్యాంకు సమీపంలోని ఇరిగేషన్ కాలువపై షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినట్లు గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బొడ్డేడ అప్పలనాయుడు, జనసేన నాయకులు ఆరోపించారు.
వారి వివరాల ప్రకారం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి దొడ్డి అప్పలనాయుడు ఇరిగేషన్ కాలువపై నిర్మాణం చేపట్టారని, దీనివల్ల రైతులకు సాగునీరు అందించే కాలువకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ అంశంపై గతంలో కలెక్టర్‌కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలోనూ ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఏఈ, ఎమ్మార్వో తదితర అధికారులు బుధవారం సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన వివరాలు, కాలువ పరిస్థితిని పరిశీలించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు.
ఇరిగేషన్ కాలువలపై ఆక్రమణలు, నిర్మాణాల విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, రైతులకు సాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని బొడ్డేడ అప్పలనాయుడు, జనసేన నాయకులు అధికారులను కోరారు.
అయితే నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, నిబంధనల ఉల్లంఘనపై అధికారుల తుది నివేదిక వెలువడాల్సి ఉంది.