బయ్యారంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు
బయ్యారం, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బయ్యారం సీఐ రవీందర్ పాల్గొని ర్యాలీ ఉద్దేశాన్ని వివరించారు.
అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి
1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దేశ సరిహద్దుల వద్ద విధులు నిర్వహిస్తున్న భారత పోలీసు బృందంపై చైనా సైనికులు దాడి చేయగా, 10 మంది పోలీసులు వీరమరణం పొందారని సీఐ రవీందర్ గుర్తుచేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అమర పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడమే సైకిల్ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
యువతలో దేశభక్తి పెంపొందించాలి
ఇలాంటి కార్యక్రమాలు యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బయ్యారం ఎస్‌ఐ ప్రశాంత్ బాబు, గార్ల ఎస్‌ఐ సాయి కుమార్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.