అక్రమ బ్లాస్టింగ్‌పై 24 గంటల తర్వాత కదిలిన రెవెన్యూ అధికారులు
చిన్నగూడూరులో తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్‌ఐ, జీపీఓ
మహబూబాబాద్ జిల్లా, చిన్నగూడూరు, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రం సమీపంలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ బ్లాస్టింగ్, క్వారీయింగ్ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. ఈ అంశంపై మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు ప్రచురితమైన 24 గంటల తర్వాత మండల రెవెన్యూ యంత్రాంగం స్పందించింది.
మండల తహసీల్దార్ (ఎంఆర్‌ఓ) ఆదేశాల మేరకు శుక్రవారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ) సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని తనిఖీ చేసి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
బ్లాస్టింగ్ ఆనవాళ్లను పరిశీలించిన అధికారులు
సంఘటనా స్థలంలో ఉన్న టాటా హిటాచీ ఎక్స్‌కవేటర్, బ్లాస్టింగ్ కోసం డ్రిల్ చేసిన రంధ్రాలు, పగులగొట్టిన బండరాళ్లను అధికారులు పరిశీలించి ఫొటోలు తీసినట్లు సమాచారం. స్థానిక గ్రామస్తుల నుంచి కూడా వివరాలు సేకరించారు.
విచారణ అనంతరం ఆర్‌ఐ మాట్లాడుతూ.. ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఎంఆర్‌ఓ ఆదేశాల మేరకు స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపినట్లు తేలితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని గ్రామస్తుల విజ్ఞప్తి
రెవెన్యూ అధికారుల విచారణతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ బ్లాస్టింగ్, మైనింగ్‌ను పూర్తిగా అరికట్టి గ్రామ పర్యావరణాన్ని, ప్రజల భద్రతను కాపాడాలని కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, గనుల శాఖ అధికారులను కూడా కలిసి ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు భావిస్తున్నారు.