ఈ నెల 11 నుంచి పెనుగొలను శివాలయంలో దసరా ఉత్సవాలు
20వ తేదీ వరకు అమ్మవారికి విశేష అలంకరణలు.. శిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ వార్షికోత్సవాలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయంలో కొలువైన శ్రీ పార్వతీ అమ్మవారికి పది రోజులపాటు వివిధ రూపాల్లో విశేష అలంకరణలు, కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు జరపనున్నారు.
అమ్మవారి రోజువారీ అలంకరణలు ఇలా..
అక్టోబర్ 11న బాల త్రిపురసుందరీ దేవిగా, 12న గాయత్రీ దేవిగా, 13న అన్నపూర్ణ దేవిగా, 14న మహాచండీ దేవిగా, 15న లలితా త్రిపురసుందరీ దేవిగా, 16న సరస్వతీ దేవిగా, 17న మహాలక్ష్మీ దేవిగా, 18న దుర్గాదేవిగా, 19న మహిషాసురమర్దిని దేవిగా, 20న రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఉత్సవాల తొలిరోజైన అక్టోబర్ 11న గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మకు కావిడి సేవ నిర్వహించనున్నారు. అదే రోజు శివాలయంలో గణపతి హోమం జరపనుండగా, మిగిలిన తొమ్మిది రోజులు చండీ హోమం నిర్వహించనున్నారు. అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారికి శాంతి కల్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని శమీ వృక్షం వద్ద శమీ పూజ జరపనున్నారు.
దసరా ఉత్సవాల పది రోజులపాటు భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పొట్టి నాగరాజు, కార్యదర్శి నాళ్ల వెంకట మోహన్ రావు తెలిపారు.
శిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ వార్షికోత్సవాలు
ఇదే ఆలయ ప్రాంగణంలోని శిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నట్లు సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు వెల్లడించారు. దసరా ఉత్సవాలు, వార్షికోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.