8వ తరగతి విద్యార్థులకు ఉచిత NMMS పుస్తకాల పంపిణీ
చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని వెలిమినేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మంగళవారం ది మిషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పుస్తకాలను పంపిణీ చేశారు.
సంస్థ చైర్మన్ ఏడుకొండలు సూచన మేరకు సంస్థ భాగస్వామి పాల వెంకన్న విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా పాల వెంకన్న మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో విద్యార్థులకు అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్షకు సిద్ధమయ్యేందుకు ఈ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో చదువుతూ తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థుల్లో విద్యా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందించేందుకు సంస్థ తరఫున సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
NMMS వంటి స్కాలర్‌షిప్ పరీక్షలకు విద్యార్థులు ముందుగానే ప్రణాళికతో సిద్ధమై, అందుబాటులో ఉన్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా చదువుతూ ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.