విద్యార్థులకు దుస్తులు, షూల పంపిణీ
NYODAY NEWS ; చిట్యాల,
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని పెద్దకాపర్తి సర్పంచ్, చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం అందించిన విద్యార్థుల దుస్తులు, షూల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకొని విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం, దుస్తులు, షూల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో పాఠశాలకు అవసరమైన ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు ఇతర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, వార్డు సభ్యులు కురు యాదయ్య, ఆనగంటి నరేష్, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు తదితరులు పాల్గొన్నారు.