ఘనంగా సన్మానించిన జిల్లా పద్మశాలి సంఘం నాయకులు
దండేపల్లి: దండేపల్లి మండలంలోని పద్మశాలీల ఐక్యత, అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న ఒడ్డపెల్లి దేవయ్యను మంచిర్యాల జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు.
దండేపల్లి పట్టణంలో పద్మశాలి సంఘ భవనం, శ్రీ శివభక్త మార్కండేయ స్వామి ఆలయ నిర్మాణానికి దేవయ్య చేసిన కృషిని గుర్తించిన సంఘం నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పద్మశాలి సమాజ ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా సంఘ భవనం, మార్కండేయ స్వామి ఆలయ నిర్మాణానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు గాదాసు బాపు, రాష్ట్ర ప్రసార కార్యదర్శి వేముల రాజ గురువయ్య, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బండి రాజలింగు, జిల్లా నాయకులు వనం సత్యనారాయణ, దేవసాని నాగరాజు, హాజీపూర్ మండల అధ్యక్షుడు సాంబారి కుటుంబరావు, దండేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు వంగ శంకరయ్య, ఎనగందుల సత్యం, దండేపల్లి పట్టణ అధ్యక్షుడు ఒడ్నాల శంకర్‌తో పాటు పుర ప్రముఖులు, మండల పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా “జై పద్మశాలి.. జైజై మార్కండేయ.. పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేశారు.