బయ్యారం పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించిన డీఎస్పీ
పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్ష.. రాత్రి గస్తీని పటిష్టం చేయాలని సూచన
బయ్యారం, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
మహబూబాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని బయ్యారం పోలీస్ స్టేషన్‌ను డివిజనల్ పోలీస్ అధికారి తిరుపతి రావు వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. సీఐ రవీందర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ప్రశాంత్ బాబు డీఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరును డీఎస్పీ సమీక్షించారు.
రికార్డులు, పెండింగ్ కేసులపై సమీక్ష
పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన డీఎస్పీ, కోర్టు విచారణలు, ఎలక్ట్రానిక్ రికార్డులు (ఈ-కాప్స్), పెండింగ్ కేసుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
విలేజ్ పోలీస్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శించాలని, పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రాత్రి గస్తీని మరింత పటిష్టం చేసి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీసుల పనితీరుపై అభినందన
మండలంలో శాంతిభద్రతలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ఎస్‌ఐ ప్రశాంత్ బాబు, పోలీస్ సిబ్బంది పనితీరును డీఎస్పీ తిరుపతి రావు అభినందించారు.
ఈ తనిఖీల్లో బయ్యారం పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.