నిరాశ్రయురాలికి అండగా ఏలూరు శక్తి టీమ్.. మిషనరీస్ ఆఫ్ చారిటీలో ఆశ్రయం
ఏలూరు: నిరాశ్రయులకు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఏలూరు శక్తి టీమ్ మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. ఏలూరులోని రామకోటి సెంటర్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా నివాసం లేకుండా రోడ్లపై జీవిస్తున్న ఓ మహిళను గుర్తించిన టీమ్ సభ్యులు ఆమెకు ఆశ్రయం కల్పించేందుకు ముందుకొచ్చారు.
మహిళ పరిస్థితిని గుర్తించిన ఏలూరు శక్తి టీమ్ సభ్యులు స్పందించి, ఆమెను సురక్షితంగా స్థానిక మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థకు చేర్చారు. అక్కడ ఆమెకు ఆశ్రయంతోపాటు అవసరమైన సంరక్షణ అందేలా ఏర్పాట్లు చేశారు.
ఇప్పటివరకు ఏలూరు శక్తి టీమ్ ఇద్దరు నిరాశ్రయులను గుర్తించి, సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించేందుకు కృషి చేయడం విశేషం. సమాజంలో నిరాశ్రయులు, ఆపదలో ఉన్నవారు కనిపిస్తే వారికి సహాయం చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని టీమ్ సభ్యులు తెలిపారు.
నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుతున్న ఏలూరు శక్తి టీమ్ సేవలను పలువురు అభినందిస్తున్నారు.