బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలి: ఎమ్మెల్యే
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలి
చింతల్: మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో అవగాహన సదస్సు నిర్వహించారు.
కుత్బుల్లాపూర్ (131), జీడిమెట్ల (132), చింతల్ (128) డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, ఓటర్ల నమోదు కార్యక్రమంలో అనుసరించాల్సిన విధివిధానాలను వివరించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా వ్యవహరించాలని కేపీ వివేకానంద్ సూచించారు. ప్రతి డివిజన్‌లో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.