అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
తెలంగాణ
/
ఆదిలాబాద్
ఆదిలాబాద్: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తలమడుగు మండలానికి చెందిన కాడే లస్మన్న (65) తనకున్న 2.20 ఎకరాల భూమిలో పత్తి సాగు చేశారు.
అయితే సాగుకు అవసరమైన నీరు అందక పంట ఎండిపోవడంతో లస్మన్న తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పత్తి సాగు కోసం చేసిన పెట్టుబడి అప్పులతో పాటు కూతుళ్ల వివాహాల కోసం తీసుకున్న అప్పులు కూడా ఉండటంతో వాటిని ఎలా తీర్చాలోనని ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.