రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి
ఎల్కతుర్తి: రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుని గుర్తింపు నంబర్ పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర సూచించారు. ఎల్కతుర్తి మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన కల్పించారు.
ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్‌ను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) ద్వారా లేదా మీ సేవ కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ గుర్తింపు నంబర్ ద్వారా రైతులకు ఎరువుల కొనుగోలు, పంట రుణాలు పొందడం, పంటల విక్రయంతో పాటు వ్యవసాయానికి సంబంధించిన పలు సేవలను పొందేందుకు ఉపయోగపడుతుందని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీల వద్ద ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి రైతుల ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు విజయ్ చంద్ర తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ భవిష్యత్తులో వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ సేవలు, పథకాలను పొందేందుకు ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సహకారం అందించేందుకు వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, రైతు సంఘం నాయకుడు హింగే భాస్కర్, మండల వ్యవసాయ అధికారి, వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.