పెదకూరపాడు నియోజకవర్గంలో రూ.10 కోట్లతో 83 రోడ్లకు శంకుస్థాపన
పెదకూరపాడు: పల్లెపండుగ 3.0లో భాగంగా వీబీజీ రామ్‌జీ పథకం కింద పెదకూరపాడు నియోజకవర్గవ్యాప్తంగా సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 83 రోడ్ల పనులకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శంకుస్థాపన చేశారు. పెదకూరపాడు మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, ఆరోగ్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో పెదకూరపాడు నియోజకవర్గంలో సుమారు రూ.280 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అవసరమైన మౌలిక వసతులను కల్పించే దిశగా కృషి కొనసాగిస్తామని చెప్పారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపీడీవో, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.