చనుబండలో ఉచిత వైద్య శిబిరం.. 102 మందికి వైద్య సేవలు
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని రామాలయ ప్రాంగణంలో గురువారం సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన మాసోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ గంగాధర్ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ శిబిరంలో మధుమేహం, రక్తపోటు పరీక్షలతో పాటు మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అవసరమైన వారికి మందులు అందించామని, అత్యవసర చికిత్స అవసరమైన వారిని ఏరియా ఆసుపత్రికి పంపిస్తామని పేర్కొన్నారు. ఈ శిబిరం ద్వారా మొత్తం 102 మంది వైద్య సేవలు పొందినట్లు వెల్లడించారు.
బీజేపీ ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్లను, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అనారోగ్యాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కోరారు. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు వర్తించే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకంతో పాటు అర్హులకు అందుబాటులో ఉన్న ఇతర ఆరోగ్య పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయడంలో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలని తెలిపారు. ముందస్తు పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యలను గుర్తించి, వాటి తీవ్రత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
అనంతరం వైద్య శిబిరంలో సేవలందించిన వైద్య సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చీదదిరాల మారేశ్వరరావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, రామాలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, నెక్కలపు వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది శాంతి, కీర్తి, స్వరూప, కుమారి, సరోజిని, జైబాబు, ప్రభాకర్, దార్ల సురేష్, రాజశేఖర్, లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు.