కొండపి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
238 మందికి వైద్య పరీక్షలు.. 25 మంది రక్తదానం.. 81 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్
కొండపి: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కొండపి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో బుధవారం నిర్వహించిన ‘సేవా సంకల్ప్ అభియాన్’ ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో మొత్తం 238 మందికి వివిధ విభాగాల వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మరో 25 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వి. లక్ష్మీకుమారి, ఒంగోలు పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి శిబిరాన్ని ప్రారంభించారు. కొండపి సీహెచ్సీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కనుమూరి అవినాష్ అధ్యక్షత వహించారు.
ఒంగోలుకు చెందిన హెచ్సీజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యుల బృందం 81 మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించింది. వీరిలో 45 మందికి సీఏ-125 పరీక్షలు, 23 మందికి రొమ్ము థర్మల్ స్కానింగ్, ఎనిమిది మందికి పీఎస్ఏ పరీక్షలు, ఐదుగురికి పాప్ స్మియర్ పరీక్షలు చేశారు.
ఇవే కాకుండా షుగర్, కిడ్నీ సంబంధిత సమస్యలు, హిమోగ్లోబిన్, కొలెస్ట్రాల్, కామెర్లు, మూత్ర పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహించారు. వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు, పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది శిబిరంలో పాల్గొని సేవలందించారు.
శిబిరాన్ని విజయవంతం చేసిన వైద్యులు, సిబ్బంది, రక్తదాతలకు కొండపి ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కనుమూరి అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు.